ఈ నెల 31న ఆదివారం రోజున కూడా బ్యాంకులు పనిచేస్తాయి – RBI

ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్‌ (RBI) సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉండాలని సూచించింది.

ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల బ్రాంచులు అన్నింటిని మార్చి 31న (ఆదివారం) తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరిచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. కాగా బ్యాంకులు సాధారణంగా అన్ని ఆదివారాలు, ప్రతి నెల 2, 4వ శనివారాల్లో మూసి ఉంటాయనే విషయం తెలిసిందే.