నేటితో ముగియనున్న రూ.2000 నోట్ల మార్పిడికి గడువు

రేపటి నుంచి ఆర్థిక లావాదేవీలకు ఈ నోటు ఉపయోగపడదంటూ గతంలోనే ఆర్బీఐ ప్రకటన

rbi-deadline-for-exchanging-rs-2-thousand-notes-ends-today-what-happens-tomorrow

న్యూఢిల్లీః రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కానుంది. మరి రేపటి నుంచీ రూ.2 వేల నోటు చెల్లదా? అనే సందేహం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే, ఆర్బీఐ గతంలోనే ఈ ప్రశ్నకు సవివరమైన సమాధానం ఇచ్చింది.

సెప్టెంబర్ 30లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని మే 16న ఆర్బీఐ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచీ ఈ నోటుతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, నోటు మాత్రం యథావిధిగా లీగల్ టెండర్‌గా కొనసాగుతుంది. అంటే.. ప్రజలు అక్టోబర్ 1 నుంచీ ఈ నోటును కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే మార్చుకోగలరు. మునుపటి వలే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకుల్లోనే ఇతర నోట్లుగా మార్చుకోవడం కుదరదు.

అయితే, అక్టోబర్ నుంచీ ఆర్బీఐ శాఖల్లో ఈ నోట్లు మార్చుకునే వారు పాత డెడ్‌లైన్ ఎందుకు మిస్సయ్యారో చెప్పాల్సి ఉంటుంది.