శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రణిల్ విక్రమసింఘే

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే..ఈరోజు గురువారం ప్రమాణ స్వీకారం చేసారు. గొటబాయ రాజపక్సే స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. పార్లమెంటులో గతవారం జరిగిన ఓటింగ్‌లో రణిల్‌కు 134 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి దలస్ అలాపేరుమాకు 82 ఓట్లు లభించాయి. మొత్తం 223 ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. పోలైన 223 ఓట్లలో 219 ఓట్లు చెల్లుబాటు అవుతాయని పరిగణనలోకి తీసుకున్నారు. నాలుగు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.
ఇక ఈరోజు ఉదయం శ్రీలంక పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా 73 ఏళ్ల విక్రమసింఘేతో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకరం చేయించారు. ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు రణిల్ విక్రమసింఘే ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని నెలలుగా ప్రజా ఆందోళలనల తర్వాత పరిపాలనను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇక రాణిల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైనా.. ప్రజల్లో మాత్రం అసహనం ఉంది. ఆయనకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో రాణిల్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.