కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

మరికాసేపట్లో భారత 15 వ రాష్ట్రపతి ఎవరా అనేది తేలిపోనుంది. పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి పీఠం కోసం అధికార ఎన్డీయే కూటమి నుంచి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పోటీ చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవికాలం మరో మూడు రోజుల్లో ముగియనుంది. నూతన రాష్ట్రపతిగా గెలుపొందని అభ్యర్థి ఈ నెల 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాన రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి.మోడీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్‌ పేపర్లను వేరు చేస్తారు. ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీషు అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా నిర్ణయించారు.

జులై 18న జ‌రిగిన‌ రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపారు. 60 శాతం వరకు ద్రౌపది ముర్ము గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.