కేఏ పాల్ తో రాజగోపాల్ రెడ్డి ని పోల్చిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని విడి బిజెపి లో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ ఫై రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కేఏ పాల్ తో రాజగోపాల్ రెడ్డి ని పోలుస్తూ విమర్శలు చేసారు. కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని పదవులు ఇచ్చిందని , ఎన్నో అవకాశాలు దక్కించుకున్నారని రాంరెడ్డి అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ని విడి రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరడం దారుణమన్నారు.

ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటేనని… ఏం మాట్లాడతారో వారికే తెలియదని రాంరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని… వెంకటరెడ్డి తీరును చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అనుమానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా… అమిత్ షాను కలిసేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

ఇక నిన్న చండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ లో మరోసారి రాజగోపాల్ రెడ్డి ఫై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలారని, తన రాజకీయ జీవితంలో రాజగోపాల్ రెడ్డి వంటి ద్రోహిని చూడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన నేత రాజగోపాల్‌రెడ్డి అని.. రాజగోపాల్‌రెడ్డి ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడని అంటూ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలారని విమర్శించారు. నమ్మినవారిని మోసం చేసి కేంద్రమంత్రి అమిత్‌షా వైపు వెళ్లాడని, కాంగ్రెస్ పార్టీలో పోరాటాలకు కలిసి రాలేదు కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్‌షా వైపు వెళ్తాడా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.