ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంది – జస్టిస్‌ ఎన్వీ రమణ

ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. విజయవాడలో నూతన కోర్టుల భవనాల సముదాయాన్ని సీఎం జగన్‌తో కలిసి సీజేఐ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడిన తర్వాత తాను తెలుగులో మాట్లాడకపోతే బాగోదు అన్నారు. ఇది మంచి పరిణామం.. మిగిలిన వక్తలు ఆంగ్లంలో ప్రసంగించారని.. ముఖ్యమంత్రి, తాను మాత్రమే తెలుగులో మాట్లాడటం ఓ ప్రాధాన్యంగా భావిస్తున్నాను అన్నారు. పదేళ్ల తర్వాత శంకుస్థాపన చేసిన కోర్టు భవనాలు ప్రారంభించడం గొప్ప విషయంగా భావిస్తున్నానని.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యలు వెంటాడటంతో కాస్త ఆలస్యం అయ్యిందన్నారు.

న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు.. కొందరు ముఖ్యమంత్రులు మద్దతు ఇచ్చారన్నారు. వారిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఉన్నారన్నారు. పెండింగ్‌ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలన్నారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అన్నారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలన్నారు. సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లను ప్రోత్సహిస్తే బాగుంటుందని సూచించారు. సమాజం శాంతియుతంగా, ఐకమత్యంతో ఉంటే అభివృద్ధి చాలా సులువుగా జరుగుతుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో కోర్టు భవనాల నిర్మాణానికి నిధుల కోసం కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని చెప్పారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

తన ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవ్యవస్థలో తనవంతుగా చాలా ఖాళీలు పూర్తిచేశానన్నారు. అన్ని కులాలు, ప్రాంతాల నుంచి వచ్చినవారికి ప్రాతినిధ్యం కల్పించామని వెల్లడించారు.