పాల్వంచ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో బయటకు..అక్రమ సంబంధం బట్టబయలు

రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సంచలన సెల్ఫీ వీడియో బయటపడింది. ఆత్మహత్య కు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకొని పలు విషయాలు బయటపెట్టారు. రెండు రోజుల క్రితం ఓ వీడియో బయటకు రాగా…ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో లో వనమా రాఘవకు తన అక్కతో గత 20 ఏళ్లు గా అఫైర్ ఉందని తెలిపాడు.

వీడియో లో రామకృష్ణ ఏమని చెప్పాడంటే..‘నా నాన్న పేరు మండిగ చిట్టబ్బాయి. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెంలో ఆరోగ్య శాఖలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 1992లో నాకు 13 ఏళ్ల వయసులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మా నాన్న మృతిచెందారు. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను బతికి ఉంటాననో లేదో తెలీదు. నా పరిస్థితికి సూత్రధారి రాఘవ కాగా.. అతడికి నా అక్క మాధవి, తల్లి సూర్యవతి సహకరించారు. మా అక్కతో వనమా రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. వారికి నా తల్లి సహకరిస్తూ వచ్చింది. ఈ ముగ్గురూ కలిసి తండ్రి ద్వారా న్యాయబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు’ అని రామకృష్ణ తెలిపాడు.

‘అక్క మాధవికి పోలవరంలో రెండెకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్‌ డబ్బులో కూడా వాటా ఇచ్చాం. నేను రాజమండ్రిలో అద్దె ఇల్లులో ఉంటున్నా. ఇద్దరు ఆడపిల్లలు. వారి చదువులు, కుటుంబం గడవడానికి సంపాదించుకోవాలి. సుమారు రూ.30లక్షలు అప్పులు అయ్యాయి. న్యాయం జరగదనే కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడుతున్నా. నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ ముగ్గురిని ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నా. నాకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దు’ అని రామకృష్ణ వీడియోలో తెలిపారు.

మరోపక్క వనమా రాఘవ ను పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నారు. కొత్తగూడెంలోని ఏఎస్పీ కార్యాలయంలోనే ప్రస్తుతం రాఘవను విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌ వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు రామకృష్ణ తల్లి, అక్క ఇళ్ల వద్ద కూడా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.. విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ-2గా వనమా రాఘవ ఉన్నాడు.