రాకేష్ మృతదేహంతో టీఆర్‌ఎస్‌ అంతిమయాత్ర ..

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. నేడు రాకేష్‌ స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. వరంగల్ ఎంజీఎం నుంచి రాకేష్ అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎస్పీ, వామపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాకేష్ స్వగ్రామం దబ్బీర్ పేట వరకూ అంతిమ యాత్ర సాగనుంది. మధ్యాహ్నం రాకేష్ అంత్యక్రియలు జరగనున్నాయి.

వ‌రంగ‌ల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర కుమార స్వామి, పూలమ్మ దంప‌తుల కొడుకు రాకేశ్ (21) హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుంచి ప్రేరణ పొంది ఆర్మీలో చేరాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

దామెర రాకేశ్‌..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కార‌ణం వ‌ల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గుర‌య్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.

త‌మ కొడుకు రాకేశ్‌ గత కొన్నేళ్లుగా హన్మకొండలో ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నాడ‌ని త‌ల్లిదండ్రులు తెలిపారు. అగ్నిప‌థ్ వ‌ల్ల త‌న భ‌విష్య‌త్ పాడైపోతుంద‌ని మ‌న‌స్తాపం చెందాడ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని చెప్పారు. త‌మ పెద్ద‌కొడుకు దివ్యాంగుడ‌ని తెలిపారు. కుటుంబానికి ఆస‌రాగా ఉంటాడనుకున్న చిన్న కొడుకు కాల్పుల్లో మ‌ర‌ణించ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు.