మణిపూర్ అంశం..రాజ్యసభలో తీవ్ర గందరగోళం

rajya-sabha-adjourned-till-2-pm-amid-opposition-uproar-over-manipur-violence

న్యూఢిల్లీః మణిపూర్ అంశంతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ అల్లర్లు, తాజా ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ తర్వాత రాజ్యసభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

ఈ క్రమంలో రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే.. మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా విపక్ష నేతలు సభలో నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. మరోవైపు పార్లమెంట్ వెలుపల కూడా మణిపూర్ ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి.