రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ కుమారునికి ఈడీ నోటీసులు జారీ

Rajasthan CM Ashok Gehlot’s Son Vaibhav Summoned By ED In Foreign Exchange Violation Case

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా షాక్‌ ఇస్తున్నాయి. గురువారం ఉదయం టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పేపర్‌ లీకేజీ కేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొన్నారు.

ఫెమా నిబంధనలు అతిక్రమించి మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు గాను ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ట్రైటన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదుచేసింది. ఇదే వ్యవహారంలో జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ముంబై, ఢిల్లీలో అధికారులు గత ఆగస్టులో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ రతన్‌కాంత్‌ శర్మను సీఎం గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ వ్యాపార భాగస్వామిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం వైభవ్‌కు సమన్లు జారీచేశారు.