దుగ్గిరాలలో లోకేశ్‌పై దాడి ఫై బొత్స స్పందన..

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేత లోకేశ్ వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కు దారి తీసింది. లోకేష్ చేరుకోగానే అక్కడకు చేరుకున్న వైస్సార్సీపీ శ్రేణులు.. టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.., తెదేపా వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. లోకేశ్​తో పాటు తెదేపా శ్రేణుల పైకి వైకాపా శ్రేణులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. “చంద్ర‌బాబుపై దాడి జ‌రిగితే స్పందిస్తాం. లోకేశ్‌పై దాడి జ‌రిగితే కూడా స్పందించాలా..? లోకేశ్‌పై దాడి చేసింది వైసీపీ కార్య‌క‌ర్త‌లో, క‌డుపు మండిన వాళ్లో ఎవ‌రికి తెలుసు..? అధికారంలో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉంటే.. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక ఇలాంటి దాడులు జ‌ర‌గ‌వు. మాజీ సీఎం కాబ‌ట్టి చంద్ర‌బాబు హుందాగా ఉంటారు. చిల్ల‌ర‌గా ఉంటే… చిల్ల‌ర‌గానే ఉంటుంది” అంటూ బొత్స కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇక ఈ దాడి పట్ల లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం విచ్చలవిడిగా నడుస్తోందని అన్నారు. న్యాయం కోసం వస్తే తమపై వైస్సార్సీపీ శ్రేణులు రాళ్లు విసిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు విసిరితే పారిపోతామని అనుకుంటున్నారా..? అని వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది మంది మూకను నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర పోలీసులు ఉన్నారన్నారు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కొందరు పోలీసుల వల్ల పోలీసు వ్యవస్థకే చెడు పేరు వస్తోందన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే నోటీసులు పంపుతున్నారని అన్నారు.