ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటంతో.. వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంద‌కొడిగా సాగిన పోలింగ్.. ఆ త‌ర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.55 శాతం పోలింగ్ న‌మోదైంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్లు బారులు తీరారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో 2,41,805 ఓట్లు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 1,87,527 ఓట్లు పోలైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

చౌటుప్ప‌ల్, నారాయ‌ణ‌పురంలో భారీగా పోలింగ్ న‌మోదైంది. అయితే పోలింగ్ స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి క్యూలైన్ల‌లో నిల్చున్న వారంద‌రికీ ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం కల్పించారు. మునుగోడు పోలింగ్ వేళ చండూరు మున్సిపాలిటీలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఘర్షణ జరింది. స్థానికేతరులు వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇరు వర్గాలు గొడవకు దిగారు. దీంతో.. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో మాత్రం ఉదయం నుండి ఈవీఎం లు మొరాయించింది. దీంతో చాలామంది ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.