ప్రచారం ముగిసే సమయంలో రాజగోపాల్ కు భారీ ఊరట..

మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ కు భారీ ఊరట కల్పించింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా పెద్ద ఎత్తున నిధులను ఇతరులకు పంపిణీ చేశారంటూ కోమటిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం… ఆ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఈ క్రమంలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో భాగంగా కోమటిరెడ్డి కంపెనీ ఖాతా నుంచి ఇతరులకు రూ.5.26 కోట్లు బదిలీ అయ్యాయని కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఈసీ…కోమటిరెడ్డిపై అందిన ఫిర్యాదుకు ఆధారాలేమీ లేవని తెలిపింది.

ఇదిలా ఉంటె మునుగోడు ఉప ఎన్నికలో ప్రధానంగా టిఆర్ఎస్ – బిజెపి మధ్యనే పోటీ నెలకొంది ఉంది. ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం టిఆర్ఎస్ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. దీంతో బీజేపీ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గట్టి పోటీ ఇవ్వదు కాబట్టి ఆ పార్టీ ఓట్లను లాగేందుకు బిజెపి చూస్తుంది. కాంగ్రెస్‌కు గెలుపు అసాధ్యమని, కాబట్టి తమకు మద్ధతు ఇవ్వాలని చెప్పి కమలం నేతలు సైలెంట్‌గా ఓటర్లలోకి వెళుతున్నారు. అటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు..ఏ ఇతర పార్టీలకు ఎక్కువ పడకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే సర్వేల్లో ఏ పార్టీ గెలిచిన తక్కువ మెజారిటీతోనే గెలుస్తుందని అంటున్నారు.