భోపాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం : అప్పుడే పుట్టిన నలుగురు చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలోని పిల్లల ఐసీయూ వార్డులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అప్పుడే పుట్టిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఆసుపత్రిలోని స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం జరిగినపుడు కనీసం 40 మంది పిల్లలు ఐసీయూ వార్డులో ఉన్నారు. వారిలో 36 మంది పిల్లల్ని మరో వార్డుకు తరలించారు. నలుగురు పిల్లలను కాపాడలేకపోయారు.

ఈ ప్రమాదం ఫై బాధాకరమని, రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి మహ్మద్ సులేమాన్ దర్యాప్తు చేస్తారని సీఎం చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చామని, అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ… ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఇతరులతో కలిసి తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు. వార్డు లోపల మొత్తం పొగలతో నిండిపోయి ఉందని తెలిపారు. వార్డులో ఉన్న చిన్నారులను పక్కన ఉన్న మరో వార్డులోకి తరలించామని చెప్పారు.
ఆసుపత్రిలోని మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించిందని…. ఎనిమిది నుంచి పది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయని ఫైర్ స్టేషన్ అధికారి తెలిపారు.