20న నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ కార్మికులతో రాహుల్ గాంధీ భేటి

Rahul Gandhi met the workers of Nizam Sugars factory on 20th

హైదరాబాద్‌ః తెలంగాణలో ఎన్నికల రణభేరి మోగించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు ఈరోజు రాష్ట్రానికి వస్తున్న విషయం తెలిసిందే. ములుగు జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభించి.. సభలో ప్రసంగించిన అనంతరం ప్రియాంక ఢిల్లీకి తిరిగి వెళ్తారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రంలో మూడ్రోజులు పర్యటించి.. వివిధ వర్గాల వారితో భేటీ అయి వారి సమస్యలు తెలుసుకుంటారు.

ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో కీలక సమస్యలైన బీడీ కార్మికులు, గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లినవారి కుటుంబాలు, నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ కార్మికులతో రాహుల్‌ గాంధీ నేరుగా మాట్లాడనున్నారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలా జరిగితే.. ఆ ప్రాంత రైతులు, కార్మికుల్లో సానుకూల స్పందన వస్తుందని టాక్.

ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో పసుపు, చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి ఇచ్చే హామీలపైనా కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్ పెడుతోంది.. బస్సుయాత్రలో రైతు సమస్యలపై ఎక్కువగా మాట్లాడేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. తమ గ్యారెంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీరి ప్రచారం ఉపయోగపడుతుందని భావిస్తోంది.