ఆజాద్ పూర్ మండీలో కూరగాయలు, పండ్ల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi meets vegetable and fruit vendors in Delhi’s Azadpur Mandi

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం ఢిల్లీ లోని ఆజాద్ పూర్ మండీని ఆకస్మికంగా సందర్శించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న రాహుల్.. మండీలో కలియతిరిగారు. అక్కడి కూరగాయలు, పండ్ల వ్యాపారులు, విక్రయదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మార్కెట్ లో పండ్లు, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన విషయం తెలిసిందే. అదే పంథాను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవలే ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు హర్యానాలో లారీ ఎక్కిన ఆయన వంద కిలోమీటర్ల వరకు అందులో ప్రయాణించారు. మధ్యలో ధాబాలో టీ తాగుతూ డ్రైవర్లతో మాట్లాడారు. అదేవిధంగా గత నెలలో ఢిల్లీలోని బైక్‌ మెకానిక్‌ వర్క్‌షాపుకు వెళ్లి.. పానా పట్టి బైక్‌ను ఎలా రిపేర్‌ చేయాలో మెకానిక్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోని సోనీపట్ సమీపంలో ఉన్న మదీనా గ్రామ శివారుల్లోని పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులను కలిశారు. ప్యాంటును మోకాళ్లవరకు మడిచి పొలంలోకి దిగారు. అక్కడ వరినాటుతున్న రైతులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి వరి నాట్లు వేశారు. ట్రాక్టర్‌ ఎక్కి దుక్కిదున్నారు. ఇప్పుడు కూరగాయలు, పండ్ల విక్రయదారులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.