ఎన్నికలు వచ్చినప్పుడల్లా బిజెపి ఎందుకు దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుంది..?: రాహుల్‌గాంధీ

ఉదయ్‌పూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ఉదయ్‌పూర్‌లోని వల్లభ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మాట్లాడారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పైనుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఎన్నికలు వచ్చినప్పుడల్లా విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపికి అలవాటుగా మారిందని విమర్శించారు. పేదల పొట్టగొట్టి సంపన్నులకు దేశ సంపదను దోచిపెట్టడమే బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని అన్నారు.
‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా బిజెపి ఎందుకు దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుంది..? ఇది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. బిజెపి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నిరుద్యోగం, రెండు ద్రవ్యోల్బణం. ఈ రెండింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల్లో లబ్ధి పొందడం బిజెపికి బాగా తెలిసిన విధానం. పేదలు, కూలీలు, రైతులు, గిరిజనులు, దళితులను సంపదకు దూరం చేయడమే బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం. ఇప్పటికే కోటీశ్వరులుగా ఉన్న సంపన్నులకు దేశ సంపదను దోచి పెట్టాలన్నదే వాళ్ల అభిమతం’ అని రాహుల్‌గాంధీ విమర్శించారు.
రాజస్థాన్‌లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.