సూరత్ కోర్టు తీర్పుపై స్పందించిన రాహుల్‌ గాంధీ

సత్యమే నా దేవుడు..రాహుల్ ట్వీట్

rahul-gandhi-1st-response-on-conviction-case-with-mahatma-gandhi-truth-quote

న్యూఢిల్లీః ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘నా మతం.. సత్యం, అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు.. అహింసే అందుకు సాధనం – మహాత్మా గాంధీ’’ అని ట్వీట్ చేశారు.

2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరుపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోదీ అనే ఎందుకు ఉంటాయని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ.. సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు.. తాజాగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది.