వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

ర్యాగింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. ఎక్కడ కూడా ర్యాగింగ్ అనే పదం వినిపించకూడదని ప్రభుత్వాలు చెపుతుంటే..కొన్ని కళాశాలలో మాత్రం సీనియర్లు , జూనియర్ల ఫై ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.

ఓ విద్యార్థి ట్వీట్‌తో ఈ ర్యాగింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్ విద్యార్థులు కొందరు మద్యం మత్తులో తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకుడిని ట్యాగ్ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్ చేశాడు.

2017 బ్యాచ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు మద్యం తాగి తమను వేధిస్తున్నట్టు ఆ ట్వీట్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, విద్యార్థి ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు కొట్టిపడేశారు. ర్యాగింగ్ వార్త నిజం కాదన్నారు. కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ భవనాలు దూరదూరంగా ఉంటాయన్నారు. సీనియర్ విద్యార్థులు కొందరు జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు.