రాధేశ్యామ్‌ నుండి కృష్ణంరాజు ఫస్ట్ లుక్ రిలీజ్

రెబెల్ స్టార్ కృష్ణం రాజు ..ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ లో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అభిమానులంతా ఈ పాత్ర ఏంటి..ఆ పాత్ర లో కృష్ణం రాజు ఎలా కనిపిస్తాడా అని అంత మాట్లాడుకుంటూ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో వారి ఎదురుచూపులు తెరదించారు చిత్ర యూనిట్.

రాధేశ్యామ్ సినిమాలో మహాజ్ఞాని పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కనిపించబోతున్నాడు. ఈయన తాలూకా పోస్టర్ లో గుబురు గెడ్డంతో అదిరిపోయే లుక్‌లో కనిపించారు కృష్ణం రాజు. ఈ పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారట. పాత్రకు సరిగ్గా యాప్ట్ అయ్యేలా ఉన్న ఆయన లుక్ విడుదలైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్ చూసి ‘సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

గతంలో ప్రభాస్‌తో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’‌ సినిమాల్లో నటించారు కృష్ణం రాజు. చివరిసారిగా 2015 సంవత్సరంలో వచ్చిన ‘రుద్రమదేవి’ మూవీలో గణపతి దేవుడుగా కనిపించారు. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన వెండితెరపై కనిపించనుండటం, అది కూడా ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమా రాధేశ్యామ్‌లో కావడం జనాల్లో ఆసక్తి నెలకొల్పింది. ఇక రాధే శ్యామ్ లో ప్రభాస్‌ పామ్‌ రీడర్‌గా విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.