గజ్జర్‌, బకర్వాల, పహారీలకు ఎస్టీ హోదాః అమిత్ షా ప్రకటన

quota-benefits-to-gujjars-bakerwals-paharis-in-j-k-says-amit-shah

శ్రీనగర్‌ః జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే దేశంలోనే ఒక భాష మాట్లాడే వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం తొలిసారి కానుంది. ఇది జరగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలి.

జస్టిస్ శర్మన్ కమిషన్ గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని.. అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతాయని చెప్పారు. ఆర్టికల్ 370, 35ఏ లను తొలగించకుంటే గిరిజనులు రిజర్వేషన్లు పొందడం సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని తొలగించడంతో గిరిజనులు వారి హక్కులు పొందుతారని వెల్లడించారు. 70ఏళ్లుగా కశ్మీర్ ను మూడు కుటుంబాలే పాలించాయని.. ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిపులు పెంచామని, 100కుపైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జరిగాయన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/