సిద్దూ మూసేవాలా హత్య కేసు..ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్ అరెస్టు..!

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కాలిఫోర్నియాలో చిక్కినట్టు నిఘా వర్గాలకు సమాచారం

punjabi-singer-sidhu-moose-wala-murder-mastermind-goldy-brar-detained-in-california

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసు సూత్రధారి గోల్డీ బ్రార్ ఎట్టకేలకు పట్టుబట్టాడు. కాలిఫోర్నియాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు భారత నిఘా వర్గాలు తెలిపాయి. అయితే, మూసేవాలా పట్టుబడినట్టు అంతర్జాతీయ వర్గాల నుంచి భారత నిఘా సంస్థలకు సమాచారం అందినప్పటికీ, కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి భారత్‌కు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కాలిఫోర్నియాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు రా, ఐబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, పంజాబ్ ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

సిద్ధూ మూసేవాలా ఈ ఏడాది మే 29న హత్యకు గురయ్యారు. వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికే క్రమంలో పంజాబ్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ హత్య జరగడంతో కలకలం రేగింది. సిద్ధూకి నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా ఇద్దరిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఉంది. అయితే, సిద్ధూ తన ఇద్దరు స్నేహితులతో సాధారణ వాహనంలో బయటకు రావడంతో అప్పటికే ఆయన కోసం కాచుక్కూర్చున్న దుండగులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ హత్యకు ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/