నిర్భయ దోషుల పిటిషన్లు కొట్టివేసిన ఢిల్లీ కోర్టు

అవసరమైన పత్రాలు తీహార్ జైలు అధికారుల ఇవ్వలేదని పిటిషన్

Nirbhaya Convicts
Nirbhaya Convicts

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులకు ఇక దారులన్నీ మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో పిటిషన్ వేస్తూ కాలహరణం చేస్తున్న విషయం తెలిసిందే. తాము క్యురేటివ్ పిటిషన్లు, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలు తీహార్ జైలు అధికారులు ఇవ్వలేదంటూ వినయ్ కుమార్, అక్షయ్ కుమార్, పవన్ సింగ్ తరపు న్యాయవాది తాజాగా నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఈ రోజు పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల న్యాయవాదుల వాదోపవాదనలు విన్న తర్వాత కొట్టివేశారు.

ఢిల్లీ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషులకు ఎప్పుడెప్పుడు ఏయే పత్రాలు అందించింది సవివరంగా తెలిపారు. దోషుల తరపు న్యాయవాది మాట్లాడుతూ వినయ్ శర్మపై విషప్రయోగం జరిగిందని, అందుకే అతన్ని ఆసుపత్రిలో చేర్చారని, దీనికి సంబంధించి వైద్య ధ్రువపత్రం ఇప్పటికీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని, జైల్లో ఆహారం కూడా తినడం లేదని, వైద్య నివేదిక ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి పట్టించుకోలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన వివరణ మేరకు సంతృప్తి చెందుతూ పిటిషన్లు కొట్టేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/