మోదీ కేబినెట్‌లో ఆరుగురు న్యాయవాదులకు చోటు

ఆదివారం మోడీ కొత్త కాబినెట్ వర్గం ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీ లోని రాజ్​భవన్​ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. ముందుగా మోడీ ప్రధానిగా ప్రమాణం చేసారు. మొత్తం 72 మందితో కేంద్ర మంత్రి మండలి ఏర్పడింది. 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆసక్తికరంగా కేంద్ర కేబినెట్ హోదా దక్కించుకున్న మంత్రుల్లో ఏకంగా ఆరుగురు న్యాయవాదులు ఉన్నారు. ఇక ముగ్గురు ఎంబీఏ డిగ్రీ పొందినవారు, పది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌ మాస్టర్స్ డిగ్రీలు చేయగా… మంత్రుల జాబితాలో నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, కిరెన్ రిజిజు న్యాయవాద పట్టాలు పొందారు. అలాగే కొలువుదీరిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్​లో అతిపిన్న వయస్కుడిగా టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు(36) నిలిచారు. ఈయన తర్వాత మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే(37), లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ) ఎంపీ చిరాగ్ పాసవాన్(41), రాష్ట్రీయ లోక్​దళ్(ఆర్​ఎల్​డీ) ఎంపీ జయంత్ చౌదరి(45) అతి పిన్న వయస్కులుగా ఉన్నారు. ఇక ఈ కొత్త మంత్రివర్గంలో అతి పెద్ద వయస్కుడిగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్​ మోర్చా(హెచ్​ఏఎమ్) వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ(79) ఉన్నారు.