మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

priyanka-gandhi-has-begun-congress-mp-poll-campaign-in-mp-today-with-narmada-puja

న్యూఢిల్లీః హిమాచల్‌, కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత మిషన్‌ మధ్యప్రదేశ్‌ను ప్రియాంకా గాంధీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బిజెపి హిందుత్వకు కౌంటర్‌గా హిందుత్వ సిద్దాంతానే ప్రయోగిస్తున్నారు ప్రియాంక. బజరంగ్‌బలి అండతో ఎన్నికల్లో గెలుస్తామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. జబల్‌పూర్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు ప్రియాంక. హనుమంతుడి గదలతో బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రియాంకాగాంధీకి ప్రత్యేక రీతిలో స్వాగతం పలికారు కార్యకర్తలు. జబల్‌పూర్‌లో నర్మదానదికి హారతికి హాజరయ్యారు ప్రియాంకాగాంధీ. మతకలహాలు సృష్టించి బిజెపి ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ఆరోపించారు. మతరాజకీయాలకు మధ్యప్రదేశ్‌ అడ్డాగా మారిందని మండిపడ్డారు.

ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పలు హిందూ సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. మాజీ సీఎం కమల్‌నాథ్‌ సమక్షంలో భారీ సంఖ్యలో బజరంగ్‌ సేన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.అయితే ప్రియాంక మధ్యప్రదేశ్‌ పర్యటనపై మండిపడుతున్నారు బిజెపి నేతలు . ఎన్నికలు ఉన్నప్పుడే ప్రియాంకకు పూజలు గుర్తుకు వస్తాయన్నారు. హిమాచల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికి నెరవేర్చలేదన్నారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ స్థాయి మరింత పెరగనుంది. ప్రియాంక గాంధీ ఇకపై యూపీకి మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా కాకుండా ఆమెను కేంద్ర బృందంలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రియాంక గాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా జాతీయ ఉపాధ్యక్షులుగా చేయవచ్చని తెలుస్తోంది. యూపీ బాధ్యతలు చేపట్టేందుకు కొత్త నేత కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఈ ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రియాంక గాంధీ ధీమాగా ఉన్న తరుణంలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రియాంక గాంధీ సోమవారం ఎంపీ పర్యటనలో ఉన్నారు. జబల్‌పూర్‌లోని నర్మదా తీరంలో పూజలు చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రచారం కూడా మొదలైంది. ఎంపీలో జరిగే ర్యాలీలో ప్రియాంక ప్రసంగించనున్నారు.