కరోనా తరుణంలో ప్రైవేట్‌ వైద్యుల వైఖరి సమంజసమేనా?

కొందరు ఇంటికే పరిమితం!

private doctors in the corona moment
private doctors in the corona moment

ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేసే సమయం లో సైన్యంలో పనిచేసే జనరల్స్‌ అత్యంత కీలక పాత్ర వహిస్తారు. ప్రస్తుతం కరోనాపై జరుగుతున్న యుద్ధంలో వైద్యులు కూడా సైన్యం లో పనిచేసే జనరల్స్‌ లాంటివారు.

యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేసే ఏ జనరల్‌ కూడా ప్రాణ భయంతో ఇంట్లో ఉండి పనిచేయరు.

కాని కరోనాపై జరుగుతున్న యుద్ధంలో జనరల్స్‌గా పనిచేయాల్సిన కొంత మంది ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఇంటికే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పనిచేస్తున్న కొద్దిమంది వైద్యులలో కూడా అసలు రోగిని చూడకుండానే పారామెడికల్‌ సిబ్బంది ద్వారా చికిత్స అందిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో పారామెడికల్‌ సిబ్బంది కూడా ముందుకు రావడం లేదు.

వైద్యసేవలు అందించే కొంత మంది ఉద్యోగులు ప్రాణరక్షణ వస్త్రాలను ధరించి కూడా ప్రాణభయంతో వెయిటింగ్‌ రూమ్‌లకే పరిమిత అవుతుండగా రోగి బంధువులు సేవలందిస్తున్నారు.

ప్రాణభయం వ్ఞన్నవారెవ్వరూ సైన్యంలో చేరరు. అదేవిధంగా ప్రాణభయంఉన్నవారు కూడా వైద్యవృత్తిలో ప్రవేశించకూడదు.

ఒకసారి వైద్యవృత్తిలో చేరిన తర్వాత మరల వెనుతిరగకూడదు. చరిత్ర గమనించినట్లయితే టి.బి,ఎయిడ్స్‌ వంటి అనేక ప్రాణాంతక అంటువ్యాధులకు చికిత్స అందించే వైద్యులుఎంతోమంది ప్రాణత్యాగం చేశారు.

కాని నేడు కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స చేయడానికి పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు నిరాకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కరోనా రోగులకు చికిత్సచేయని ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయాల్సి రావడమేకాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రు లను జాతీయం చేయాలనే డిమాండ్‌ ముందుకు రావడాన్ని బట్టి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కరోనా చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రులు తిరస్కరించడంవల్ల సామా న్యులే కాదు నిస్పార్‌ వంటి కళాకారులు, మేధావ్ఞలనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

మనికి వచ్చే వ్యాధులు 100 ఉన్నాయనుకొంటే వాటిలోకరోనా ఒకటి. ఇంకా గుండెజబ్బులు, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి 99 వ్యాధులున్నాయి.

కరోనా చికిత్సకు భయపడి మొత్తం ఆస్పత్రినే మూసివేస్తే ఇతర వ్యాధుల చికిత్స పరిస్థితిఏమిటి? చికిత్స చేయడం కోసమే కదా? వైద్య విద్యను అభ్యసించేది.

నిజానికి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సూచన మేరకు ఆస్పత్రులన్నీ రీసెర్చ్‌ కేంద్రాలుగా పనిచేయాలి.

అనేక ప్రాంతాలలో ఆస్పత్రులు పరిశోధనా కేంద్రాల పేరుతోనే పనిచేస్తున్నాయి.

ఆస్పత్రులకు వచ్చిన రోగులకు చికిత్స చేయడమే కాకుండా రోగిలో కొత్త లక్షణాలు,మార్పులను వైద్యులు గమనిం చడంవల్ల అనేక నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.

మెడికల్‌ కౌన్సిల్‌ సూచనలను కూడా ప్రైవేట్‌ వైద్యులు ఖాతరు చేయడం లేదు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహకులు, వైద్యులు సేవలందించడానికి బదులుగా ఆస్పత్రులను మూసివేయడం చూ స్తుంటే శత్రువులకు భయపడి బంకర్లలలో దాగే జనరల్స్‌గా అనిపిస్తోంది.

ఇక చికిత్స చేయడానికి ముందుకు వచ్చే కొద్దిపాటి ప్రైవేట్‌ ఆస్పత్రులలో చికిత్స అందించడంకంటే వ్యాధిని అడ్డు పెట్టుకొని ఏవిధంగా డబ్బు సంపాదించాలనే భావనే ఎక్కువ కనిపిస్తోంది.

ఒకవైపు కరోనా చికిత్సకు నిర్దిష్టమైన మందులు లేవని చెబుతున్నారు. చికిత్సకు బిల్లులు మాత్రం వేలు, లక్షలలో ఉంటున్నాయి.

కొంతమంది పల్మనాజిస్టులు (ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేవారు) రోగిని కనీసం దగ్గరగా కూడా చూడకుండానే ప్రతిరోజూ వేలకు వేలు ఖర్చుచేయిస్తూ టెస్ట్‌లు చేయిస్తున్నారు.

ఈ స్థితిలో ఆస్పత్రులను ప్రభుత్వం జాతీ యం చేయాలనే డిమాండ్‌ సమంజసమనిపిస్తోంది.

ఇక కరోనా వ్యాధితో మృతిచెందిన వ్యక్తుల శవాలకు అంతిమ సంస్కారం నిర్వహిస్తున్న తీరు దయనీయంగా ఉంది.

మనిషి జీవించి ఉన్న సమయంలో కక్షలు కర్పణ్యాలు ఉన్నప్పటికీ మృతిచెందిన తర్వాత భౌతికకాయం పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం, ఖననం లేదా దహనం చేసే విధానాలకు అన్ని మతాలలో అత్యంత ప్రాధాన్యత ఉంది.

కాని కరోనా కారణంగా మృతిచెందిన వ్యక్తుల భౌతిక కాయాలను అమానవీయంగా పశువ్ఞల మాదిరిగా జెసిబి, బుల్డోజర్ల సహాయంతో ఖననం చేయడం బాధకలిగిస్తోంది.

కరోనా మృతుల అంతిమ సంస్కారం చేయడంలో అవలంభించాల్సిన పద్ధతులపై కేంద్రప్రభుత్వం విధానాన్ని రూపొందించింది.

కాని ఆ విధానాలు ఆచరణలో కనిపించడం లేదు.వ్యక్తులు కరోనా కారణం గాచనిపోతే, ఆ వ్యక్తి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించకుండా ప్రభుత్వమే అంతం చేస్తోంది.

కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులు, బంధువులకు చనిపోయిన రోగి మృతదేహాన్ని కూడా చూపించడంలేదు.

మనిషి చనిపోయిన తర్వాత భౌతికశరీరంలో వైరస్‌జీవించి ఉంటుందా? ఉంటే ఎంత సేపు జీవించి ఉంటుంది అనే అంశంపై స్పష్టత ఎందుకు ఇవ్వలేక పోతున్నారు?

ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మృతులు వందలు, వేల సంఖ్యలో ఉన్నప్పటికీ శాస్త్రీయంగానే ఆయా వ్యక్తుల చివరి అంకాని ముగిస్తున్నారు.

మన రాష్ట్రంలో 1977లో దివిసీమలో వచ్చిన ఉప్పెన సమయంలో వేల సంఖ్యలో మృతదేహాలకు ఒకే సారి మూకుమ్మడిగా ఖననంచేసినా అమానవీయంగా వ్యవహరించ లేదు.

కరోనా వైరస్‌ ప్రమాదకరమైన అంటువ్యాధి అయినప్పటికీ వ్యాధితో చనిపోయినవారిని పశువుల తరహాలో కాకుండా ఒక మానవీయవిధానంలో అంతిమ సంస్కారంనిర్వహించడానికి సైంటి ఫిక్‌ విధానాన్ని రూపొందించడం అవసరం.

ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు మరింత బాధ్యత వహించాలి.

-అన్నవరపు బ్రహ్మయ్య, పాత్రికేయుడు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/