ప్ర‌ళ‌య్ క్షిపణి పరీక్ష విజయవంతం

ఇది కొత్త తరం క్షిపణి అని వెల్లడించిన డీఆర్డీవో చైర్మన్

న్యూఢిల్లీ : భారత రక్షణ శాఖ మరో అస్త్రానికి మెరుగులు దిద్దుతోంది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ‘ప్రళయ్’ అత్యంత కచ్చితత్వం (హై డిగ్రీ)తో లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. ప్రళయ్ లో ని అన్ని సాంకేతిక వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంది.

ఈ షార్ట్ రేంజ్ గైడెడ్ మిస్సైల్ 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తాకగలదు. ‘ప్రళయ్’ పరీక్ష నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. అలాగే, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తమ శాస్త్రవేత్తల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైన లక్ష్యాన్ని ఛేదించే కొత్త తరం క్షిపణి అని, సాయుధ బలగాలకు ఇది మరింత ప్రేరణాత్మక శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/