ప్రజాపాలన గడువు పెంపు లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

praja-palana-program-will-not-be-extended-in-telangana-says-ponnam-prabhakar

హైదరాబాద్‌ః తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగింది. ఆరు గ్యారంటీల పథకాల కోసం అర్జీ పెట్టుకునేందుకు ప్రజలు బారులు తీరారు. తమది ప్రజాపాలన అని గత ప్రభుత్వంలా ప్రస్తుత పాలన ఉండదంటూ కార్యక్రమాల్లో మంత్రులు ఉద్ఘాటించారు. నాలుగు రోజుల్లో కలిపి ఇప్పటి వరకు 61 లక్షల 16 వేల 167 దరఖాస్తులు అందాయి.

గడిచిన నాలుగు రోజుల్లో గ్రేటర్‌లో ఐదు గ్యారంటీల కోసం 13 లక్షల 54 వేల 817 మంది దరఖాస్తులు వచ్చినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే గ్రేటర్‌లోని ఆరు జోన్లలో కలిపి 3 లక్షల 62 వేల 6 దరఖాస్తులందాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన సదస్సుల నిర్వహణ ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాల గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6 తర్వాత మండల కేంద్రాల్లో యథావిధిగా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు.