మరికాసేపట్లో ‘ప్రజాగళం’ సభ..

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మే 13 న ఎన్నికలు జరగనుండగా ..జూన్ 04 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ తరుణంలో పొత్తుతో బరిలోకి దిగుతున్న టిడిపి, జనసేన , బిజెపి పార్టీలు..మొదటిసారి మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభలో పాల్గొనబోతున్నాయి. మరికాసేపట్లో నేడు చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ పేరుతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తం గా సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని ఆ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. కాగా సాయంత్రం 4.10 గంటలకు మోదీ గన్నవరం రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బొప్పూడి చేరుకుని.. రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకుంటారు.

కాగా గత ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గరి నుండి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఈరోజు చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.