చౌటుప్పల్ లో బిజెపికి వ్యతిరేకంగా పోస్టర్లు..
చౌటుప్పల్ మున్సిపాలిటీలో బిజెపికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో పోస్టర్లు గుర్తుతెలియని వ్యక్తులు అంటించారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ఫై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బిజెపి , కాంగ్రెస్ తో పాటు టిఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో పార్టీల నేతలంతా మునుగోడు లోనే ఉంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటి గడప తొక్కుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటె మునుగోడు నియోజకవర్గంలో బిజెపి కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో పోస్టర్లు అంటించారు. పట్టణం మొత్తం ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. చౌటుప్పల్ మండలం పక్కనే ఉన్న సంస్థాన్ నారాయణపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.
ఇక చండూరు పట్టణంలో నేడే విడుదల అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. షా ప్రొడక్షన్స్ సమర్పించు.. 18 వేల కోట్లు సినిమా సత్యనారాయణ 70 ఎంఎం థియేటర్‌లో నేడే విడుదలవుతున్నదని.. అందరూ చూడాలని పోస్టర్‌పై రాశారు. ఈ సినిమాకు కోవర్ట్ రెడ్డి దర్శకత్వం వహించారని పేర్కొన్నారు. మరి ఈ పోస్టర్ల ఫై బిజెపి ఎలా స్పందిస్తుందో చూడాలి.