జూబ్లీహిల్స్ లో ఓ కారులో రూ.89.92 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగుస్తుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు మునుగోడుకు తరలివెళ్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడ్డాయి. తాజాగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.89.92 లక్షల నగదును గుర్తించారు.

అయితే ఆ మొత్తానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అలాగే మూడు రోజుల క్రితం పంజాగుట్టలో రూ.70 లక్షలు, బేగంబజారులో రూ.48.50 లక్షలు, నగర శివార్లలో మరో రూ.45 లక్షలు పట్టుబడ్డాయి. ఇలా గత 18 రోజుల్లో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లలో రూ.20 నుంచి 26 కోట్ల మేర అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.