హిమాచల్‌ ప్రదేశ్‌ సిఎం ఎంపిక బాధ్యత ప్రియాంకాగాంధీదే..!

priyanka-gandhi-may-pick-himachal-chief-minister-says-sources

సిమ్లాః హిమాచల్‌ ప్రదేశ్‌కు కాబోయే సిఎం ఎవరనే విషయాన్ని తేల్చబోయేది కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీయేనని ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. హిల్‌స్టేట్‌లో చాలామంది ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందున వారిలో ఒకరి పేరును ఖరారు చేయడం అనేది కత్తిమీద సాము చేయడం లాంటిదే. ఎవరి వైపు మొగ్గితే ఎవరు తన వర్గీయులతో కలిసి బిజెపి పంచన చేరి పార్టీని దెబ్బకొడతారోననే ఆందోళన కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్నది.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్తగా 40 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు షిమ్లాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ కేంద్ర పరిశీలకులు రాజీవ్‌ శుక్లా, భూపిందర్‌ హుడా, భూపేశ్‌ బఘేల్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఎవరికి ఎక్కువ మంది మద్దతు ఉన్నదని వారు ప్రతి ఎమ్మెల్యేను ఆరా తీశారు. ఆఖరికి నూతన సీఎం పేరును ఖరారు చేసే బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తున్నట్లు తీర్మానం చేసి పంపించారు.

అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రచార బాధ్యతలు తన భుజాలపై వేసుకుని ముందు నడిచిన ప్రియాంకాగాంధీకే తాజా గెలుపు క్రెడిట్‌ దక్కింది. ఈ నేపథ్యంలో నూతన సిఎం పేరును ఖరారుచేసే బాధ్యతను ఆమెకే అప్పగించాలని హైకమాండ్‌ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. సిర్మౌర్‌, కంగ్రా, ఉనా ర్యాలీ సందర్భంగా ప్రియాంకాగాంధీ అగ్నిపథ్‌, అధిక ధరలు, నిరుద్యోగం, పాత పెన్షన్‌ స్కీమ్‌ అంశాలను ప్రధానంగా లేవనెత్తి హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/