ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదు

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీసు కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు.
సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. కొందరు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం.
రఘురామరాజుపై నమోదు చేసిన ఈ కేసులో ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రిలతో పాటు సీఆర్‌పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లనూ నిందితులుగా చేర్చారు. అనుమతి లేకుండా తన ఇంటి వద్ద నిఘా పెట్టారంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందినకానిస్టేబుల్‌ను రఘురామరాజు అనుచరులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.