గుడ్ న్యూస్.. కొత్తవారికీ ‘వైఎస్సార్ వాహన మిత్ర’ ఛాన్స్

ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలు అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో వర్గానికి ఒక్కో స్కీమ్ చొప్పున ప్రజలకు చాలా స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. ఏపీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో వాహన మిత్ర కూడా ఒకటి. దీనికింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులోభాగంగా.. ఈ ఏడాదికిగాను అర్హుల నుంచి రవాణా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి.రాజాబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం :-
ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం వద్ద ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్‌కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాలి.
గత ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ ఇళ్లకు కలిపి ఒకే మీటరుంటే ఇళ్ల సంఖ్యను బట్టి ఒక ఇంటికి సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తారు.
వచ్చిన దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదిస్తారు.
10న ఆ దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించిన తరువాత 11, 12 తేదీల్లో సీఎఫ్‌ఎస్‌ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్లకు పంపిస్తారు.
ఇక అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
వారి ఫిర్యాదులను పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు.