ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ సిద్ధం : ప్రధాని మోడీ

YouTube video
PM Modi’s speech at inauguration of hostel & education complex of Shri Annapurnadham Trust at Adalaj

న్యూఢిల్లీ : నేడు ప్రధాని మోడీ గుజరాత్‌లోని అడలజ్‌లో శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ విద్య, హాస్టల్ సముదాయాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అనుమతి మంజూరు చేస్తే, ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేయడానికి భారత దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని తాను చెప్పానని మంగళవారం మోడీ తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం వల్ల ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఆహార నిల్వలు క్షీణిస్తున్నాయని చెప్పారు. నేడు ప్రపంచం అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోందని, తమకు కావలసినవి ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని అన్నారు. అన్ని తలుపులు మూసి ఉండటంతో పెట్రోలు, చమురు, ఎరువులను సంపాదించడం కష్టంగా మారిందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమ వద్దనున్న నిల్వలను సురక్షితంగా కాపాడుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు.


ప్రపంచం ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోందని, ప్రపంచంలో ఆహార నిల్వలు నిండుకుంటున్నాయని చెప్పారు. తాను సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడినపుడు ఆయన కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. డబ్ల్యూటీఓ అనుమతి ఇస్తే భారత దేశం రేపటి నుంచే ఆహార సరఫరాకు సిద్ధంగా ఉందని తాను చెప్పానని తెలిపారు. మన ప్రజలకు సరిపడినంత ఆహారం మన వద్ద ఉందని, అయితే మన రైతులు ప్రపంచానికి భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తోందని చెప్పారు. అయితే మనం ప్రపంచ చట్టాలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుందన్నారు. డబ్ల్యూటీఓ ఎప్పుడు అనుమతి ఇస్తుందో, మనం ప్రపంచానికి ఆహారాన్ని ఎప్పుడు సరఫరా చేయగలమో తాను చెప్పలేనన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/