ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలకు లోనయ్యాయిః ప్రధాని మోడీ

PM Modi slams Oppn for Parliament protests

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలకు లోనయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. ఆ ఫ్రస్టేషన్‌తోనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్‌ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఢిల్లీలో మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన చూస్తుంటే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో వాళ్ల సంఖ్యలు మరింత దిగజారుతాయనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కాగా, పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. పలు కీలక బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదముంద్ర వేయించాలని చూస్తున్న కేంద్రానికి ఇది తలనొప్పిగా మారింది. దాంతో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌లకు కేంద్రం తెరలేపింది. దాంతో ఇప్పటివరకు ఉభయసభల్లో మొత్తం 141 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు.