తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడులయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హావ కొనసాగింది. అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్‌ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు.

తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల్లో మొద‌టి ప‌ది ర్యాంకుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విద్యార్థులే స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇంజ‌నీరింగ్ విభాగంలో మొద‌టి ర్యాంక్‌ను విశాఖ‌కు చెందిన అనిరుధ్‌, అలాగే అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ విభాగంలోనూ ఈస్ట్ గోదావరి విద్యార్థి బూరుగుప‌ల్లి స‌త్య రాజ జ‌శ్వంత్ ఫ‌స్ట్ ర్యాంక్ ద‌క్కించుకోవ‌డం విశేషం.
ఇంజ‌నీరింగ్ విభాగంలో మొద‌టి ప‌ది ర్యాంకుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విద్యార్థులు 8 ర్యాంకులు, అలాగే అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ విభాగంలో 7 ర్యాంకులు ద‌క్కించుకున్నారు.

ఓసారి ర్యాంకులు విషయానికి వస్తే..

ఇంజ‌నీరింగ్ విభాగంలో తొలి ర్యాంక్‌ను విశాఖ‌కు చెందిన స‌న‌పాల అనిరుధ్‌, రెండో ర్యాంక్ మ‌ణింధ‌ర్ రెడ్డి(గుంటూరు), మూడో ర్యాంక్ ఉమేశ్ వ‌రుణ్‌(నందిగామ‌), నాలుగో ర్యాంక్ అభిణిత్ మ‌జేటి(హైద‌రాబాద్), ఐదో ర్యాంక్ ప్ర‌మోద్ కుమార్ రెడ్డి(తాడిప‌త్రి) , ఆరో ర్యాంక్ మార‌ద‌న ధీర‌జ్(విశాఖ‌ప‌ట్ట‌ణం), ఏడో ర్యాంక్ వ‌డ్డే శాన్విత‌(న‌ల్ల‌గొండ‌), ఎనిమిదో ర్యాంక్ బోయిన సంజ‌న‌(శ్రీకాకుళం), తొమ్మిదో ర్యాంక్ నంద్యాల ప్రిన్స్ బ్ర‌న్హం రెడ్డి (నంద్యాల‌), ప‌దో ర్యాంక్ మీసాల ప్ర‌ణ‌తి శ్రీజ‌(విజ‌య‌న‌గ‌రం) సాధించారు.

అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ విభాగంలో మొద‌టి ప‌ది ర్యాంక‌ర్ల వివ‌రాలు. మొద‌టి ర్యాంక్‌ను బూరుగుప‌ల్లి స‌త్య రాజ జ‌శ్వంత్(ఈస్ట్ గోదావరి) ద‌క్కించుకోగా, రెండో ర్యాంక్‌ను ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల విద్యార్థి న‌శిక వెంక‌ట తేజ సాధించ‌డం విశేషం. అలాగే మూడో ర్యాంక్ స‌ఫ‌ల్ ల‌క్ష్మీ ప‌సుపులేటి(రంగారెడ్డి), నాలుగో ర్యాంక్ దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి(గుంటూరు), ఐదో ర్యాంక్ బోర వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(శ్రీకాకుళం), ఆరో ర్యాంక్ దేవ‌గుడి గురు శ‌శిధ‌ర్ రెడ్డి(హైద‌రాబాద్), ఏడో ర్యాంక్‌ వంగీపురం హ‌ర్షిల్ సాయి(నెల్లూరు), ఎనిమిదో ర్యాంక్ ద‌ద్ద‌నాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు), తొమ్మిదో ర్యాంక్‌ గంధ‌మ‌నేని గిరి వ‌ర్షిత (అనంత‌పురం), ప‌దో ర్యాంక్‌ కోళ్ల‌బ‌త్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైద‌రాబాద్) సాధించారు.