ఛాయిస్ ద్వారా వచ్చిన నేతకు, ఛాన్స్ ద్వారా వచ్చిన నేతకు తేడా ఉంటుందిః ముక్తార్

మోడీ నేతృత్వంలో భారత్ ప్రతిష్ఠ రోజు రోజుకు పెరుగుతోందన్న ముక్తార్ అబ్బాస్ నక్వీ

PM Modi leader by democratic choice, Rahul Gandhi by dynastic chant: Mukhtar Abbas Naqvi

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వ్యక్తి అని, అదే రాహుల్ గాంధీ వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా కొనసాగుతున్నారని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఆయన వయనాడ్ లో మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రజలు ఎంచుకున్న వ్యక్తి అని, కాబట్టి ఛాయిస్ ద్వారా వచ్చిన నేతకు, ఛాన్స్ ద్వారా వచ్చిన నేతకు చాలా తేడా ఉంటుందన్నారు. డైనమిక్ లీడర్ మోదీ నేతృత్వంలో భారత్ ప్రతిష్ఠ రోజు రోజుకు పెరుగుతోందన్నారు. అవినీతిని, కమ్యూనలిజాన్ని, క్యాస్టిజాన్ని ఆయన పారద్రోలి ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కోసం పని చేస్తున్నారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా మన దేశం ప్రతిష్ఠ పెరుగుతోందన్నారు. నక్వీ కేరళలో మూడు రోజుల పర్యటన కోసం వచ్చారు.

మోడీ కిందిస్థాయి నుండి వచ్చారని, కామన్ మ్యాన్ బాధలు ఆయనకు తెలుసునని, అందుకే ప్రధాని వారి కోసమే ఎన్నో పథకాలు తీసుకు వచ్చారన్నారు. అభివృద్ధి, వివక్ష లేని సాధికారత మోడీ ప్రభుత్వ మంత్రం అన్నారు. అధికారంలో ఉండటం ద్వారా లీడర్ కాలేరని, ప్రజల కోసం పని చేయాలనే చిత్తశుద్ధి ఉండాలన్నారు. అలాగే దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం ఉండాలన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం అవాస్ యోజన, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు.