ఏరో ఇండియా 2023ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi inaugurates Aero India 2023 in Bengaluru, Karnataka

బెంగాళూరుః ఏరో ఇండియా షో 14వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. యలహంక ఎయిర్ బేస్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఏరో ఇండియా షోను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం బసవరాజ్ బొమ్మై , గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత రక్షణ దళాల ప్రత్యేక క్యాప్ ధరించి ప్రధాని రావడం విశేషం. ప్రధాన మంత్రి ఎయిర్ షోను ప్రారంభించగా.. సారంగ్ హెలికాప్టర్ల వంటి యుద్ధ విమానాలు అకాశంలో కనువిందు చేశాయి.

కాగా, ఈ ఎయిర్‌ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన చూసేందుకు సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయించారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వీటిలో ఎయిర్‌బస్‌, బోయింగ్‌, లాక్హీడ్‌, మార్టిన్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, సాబ్‌, సఫ్రాన్‌, సాబ్‌, సఫ్రాన్‌, రోల్స్‌ రాయిస్‌, ఎల్‌ అండ్ టీ, భారత్‌ పోర్జ్‌ లిమిటెడ్‌, హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, బీఈఎంఎల్‌ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇండియన్‌ పెవిలియన్‌ ద్వారా 115 సంస్థల 227 ఉత్పత్తులను పదర్శిస్తారు. అందులో ఎల్‌ఆర్‌యూ, ఎల్‌సీఏ-తేజస్‌, ఎఫ్‌సీఎస్‌, డిజిటల్‌ ఫ్లై బై, మల్టీ రోల్‌ సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌, ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో తయారైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.