తెలంగాణకు మరో పిడుగు లాంటి వార్త

గత వారం రోజులు తెలంగాణలో వర్షం పడుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో అన్ని జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. పలు ప్రాజెక్ట్ లనుండి నీటికి కిందకు వదులుతున్నారు. వాగులు, వంకలు , చెరువులు ఇలా అన్ని పొంగిపొర్లుతున్నాయి. ఇంకెప్పుడు తగ్గుతాయో అని ప్రజలంతా మాట్లడుకుంటున్నవేళ వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిని అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.