రోమ్ కు వెళ్లిన ప్రధాని..12 ఏళ్లలో ఇటలీకి వెళ్లిన తొలి ప్రధాని

జీ20 సదస్సు కోసం రోమ్ కు వెళ్లిన ప్రధాని..రేపు, ఎల్లుండి జీ20 సదస్సులో పాల్గొననున్న మోడీ

రోమ్ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుండి బయల్దేరిన మోడీ ఇవాళ తెల్లవారుజామున లియోనార్డో డావిన్సీ ఎయిర్ పోర్ట్ లో దిగారు. రేపు, ఎల్లుండి (శని, ఆదివారాలు) రోమ్ లో నిర్వహించనున్న 16వ జీ20 నేతల సదస్సులో పాల్గొననున్నారు. 12 ఏళ్లలో రోమ్ కు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ నే కావడం విశేషం. ఈ విషయాన్ని ఇటలీకి భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు.

టూర్ లో భాగంగా ఆయన ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రోమ్ లోని గాంధీ విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీతో ఇరు దేశాల సంబంధాలపై చర్చిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ ను కలుస్తారు. కాగా, ఎల్లుండి జీ20 సదస్సు పూర్తి కాగానే వెంటనే ఆయన గ్లాస్గో వెళ్తారు. వచ్చే నెల ఒకటి, రెండో తేదీల్లో పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్-26) సదస్సులో పాల్గొంటారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో వెల్లడించారు.

‘‘నవంబర్ 1, 2వ తేదీల్లో గ్లాస్గోలో నిర్వహించనున్న కాప్ 26 సదస్సులో పాల్గొంటున్నా. నాతో పాటు 120 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతున్నారు. ప్రకృతితో మమేకమై బతకడమే మన సంప్రదాయం, ఈ భూగ్రహానికి మనమిచ్చే అతిపెద్ద గౌరవం. ప్రకృతిని రక్షించుకోవడంలో భాగంగా పునరుత్పాదక విద్యుత్, అడవుల పునరుజ్జీవం, జీవవైవిధ్యం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు. రోమ్ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీకీ వెళ్తానని, పోప్ ఫ్రాన్సిస్ ను కలుస్తానని తెలిపారు. ఇటలీ విదేశాంగ మంత్రి కార్డినల్ పైట్రో పారోలిన్ తో సమావేశమవుతానని చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/