రాజ‌స్ధాన్‌లో ర్యాలీకి హాజ‌రైన ప్ర‌ధాని.. స‌భ‌కు హాజ‌రై ప్ర‌క‌ట‌న చేసేందుకు స‌మ‌యం లేదా?: ఖ‌ర్గే

PM doesn’t want to speak in House but he’s making political statements in Rajasthan, says Kharge

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్‌లో మ‌ణిపూర్ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భ‌కు హాజ‌రై మ‌ణిపూర్‌పై ప్ర‌క‌ట‌న చేయాల‌ని తాము కోరుతుంటే స‌భ న‌డుస్తుండ‌గా ఆయ‌న రాజ‌స్ధాన్‌లో రాజ‌కీయ ప్ర‌సంగాలు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగిపోయార‌ని విప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మండిప‌డ్డారు. రాజ‌స్ధాన్‌లో ర్యాలీల‌కు హాజ‌రైన ప్ర‌ధానికి అర‌గంట స‌మ‌యం స‌భ‌కు హాజ‌రై ప్ర‌క‌ట‌న చేసేందుకు స‌మ‌యం లభించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోడీకి మ‌ణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ఆస‌క్తి లేద‌ని, ఆయ‌న‌కు ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల విశ్వాసం లేద‌ని వెల్ల‌డ‌వుతోంద‌ని అన్నారు. రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల‌ని ఆయ‌న కోరుకోవ‌డం లేద‌ని చెప్పారు. పార్ల‌మెంట్‌ను ప్ర‌ధాని మోడీ అవ‌మానిస్తున్నార‌ని ఖ‌ర్గే ఆరోపించారు.

ఇక అంత‌కుముందు ఈరోజు ఉద‌యం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కొంద‌రు ఎంపీలు న‌ల్ల దుస్తులు ధ‌రించి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. రాజ్య‌స‌భ‌కు చెందిన విప‌క్ష ఎంపీలు ఆ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని మోడీ స‌భ‌కు వ‌చ్చి మ‌ణిపూర్‌పై ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆ ఎంపీలు నినాదాలు చేశారు. న‌ల్ల దుస్తులు ధ‌రించిన విప‌క్ష ఎంపీల‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ విమ‌ర్శ‌లు చేశారు. ఆ దుస్తులు ధ‌రించిన వాళ్ల ప్ర‌స్తుత ప‌రిస్థితి, గ‌తం, భ‌విష్య‌త్తు కూడా న‌లుపే అని ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ఆరోపించారు. కానీ వాళ్ల జీవితాల్లో వెలుగు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.