పెట్రోలు ధర రూ.8 వరకు తగ్గింది..

పెట్రోలు ధర రూ.8 వరకు తగ్గింది…నిజామా అని షాక్ అవుతున్నారా..నిజమే కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు ఢిల్లీ లో తగ్గింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.8 వరకు తగ్గింది. సవరించిన ధరలు బుధవారం-గురువారం అర్ధ రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. కేజ్రీవాల్ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.103.97 కాగా దీనిలో సుమారు రూ.8 వరకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం నవంబరు మొదటివారంలో దీపావళి పండుగ సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోలుపై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. ఇక ఢిల్లీ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.29, డీజిల్ ధర రూ.86.80గా ఉంది. ఘజియాబాద్‌తో పాటు, ఢిల్లీ కంటే ఎన్‌సీఆర్‌లో ఉన్న గురుగ్రామ్‌లో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. గురుగ్రామ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.95.90, డీజిల్‌ రూ.87.11గా ఉంది. అయితే, ఇవాళ ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, లీటర్ డీజిల్ ధర రూ.91.43గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు పెట్రోల్ లీటరుకు రూ.104.67, డీజిల్ లీటరుకు రూ.89.79 చొప్పున విక్రయిస్తున్నారు..