సినిమాను సినిమాగా.. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి.. చిరంజీవికి పేర్ని హితవు

రాజకీయాల్లో దాడి చేస్తే ఎదురుదాడి ఉంటుందన్న పేర్నినాని

perni-nani

అమరావతిః మాజీ మంత్రి పేర్ని నాని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తాను చిరంజీవి అభిమానిగా చెబుతున్నానంటూ చురకలు అంటించారు. పేర్ని మాట్లాడుతూ.. తాను మెగాస్టార్‌కు అభిమానిని అన్నారు. సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయంగా చూడాలని హితవు పలికారు. రాజకీయాల్లో దాడి చేస్తే ఎదురుదాడి ఖాయమన్నారు. దృతరాష్ట్రుడికి తన కుమారులపై ప్రేమ ఉంటే ఎలా నష్టం జరిగిందో.. అలాంటి ప్రేమ ఉంటే ఇప్పుడూ నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ నుండి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుండి హైదరాబాద్ ఫిలిమ్ నగర్ అంతే దూరమని గుర్తుంచుకోవాలన్నారు.

అసలు రెమ్యునరేషన్ గురించి చర్చ ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చిందో తెలుసా? అని ప్రశ్నించారు. కథకు సంబంధం లేకుండా సినిమాలో మీ దురద తీర్చుకోవాలనుకున్నప్పుడు అదే తరహా ఎదురు దాడి జరిగిందని.. దాడి జరిగినప్పుడు ఎదురు దాడి సహజమే అన్నారు. ఒక రాజకీయ నాయకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా డ్యాన్స్ చేస్తే, దానిని పోలిన పాత్ర సినిమాలో పెట్టి, ఒక రాజకీయ నాయకుడిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. అలాంటి సమయంలో రెమ్యునరేషన్ గురించి చర్చ వచ్చిందన్నారు.

మా అభిమాన నటుడు, మా అభిమాన హీరో అయిన చిరంజీవి రెమ్యునరేషన్ గురించి కనుక మాట్లాడితే ఆయన అభిమానిగా.. రాజకీయ నాయకుడైన అభిమానిగా ఇదే నా సమాధానం అన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు రెమ్యునరేషన్ గురించి ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. న్యూటన్ లా ఇదేనని.. దాడి చేస్తే ఎదురు దాడి ఉంటుందన్నారు. అయితే నిజంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారా? అని మీడియాను ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారని నిలదీశారు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని, కానీ దానిని చట్టం చేయలేదని గుర్తు చేశారు. అప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండానే విభజన చేశారన్నారు. అప్పుడు చట్టంలో పెట్టనప్పుడు నా హీరో ఎక్కడ ఉన్నారో తెలిసిందే అన్నారు. చిరంజీవికి తాను వ్యక్తిగతంగా అభిమానిని అని చెప్పారు.