చైనా కోర్టులో కీలక తీర్పు

ఇంటిని చక్కదిద్దినందుకు భార్యకు పరిహారం

బీజింగ్‌: చైనాలోని ఓ డైవోర్స్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్య నుంచి భర్త విడాకులు కోరగా.. ఇంతకాలం ఇంటి పని చేసినందుకు గాను భర్త ఆమెకు 7700 డాలర్ల(రూ. 5.57 లక్షలు) పరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పిచ్చింది. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం సహజమే. ఆస్తి, ఇతరత్రా విషయాల్లో భర్త నుంచి భార్యకు డబ్బులు రావడం కూడా చూశాం. కానీ.. మొదటిసారి తమ బిడ్డను, ఇంట్లో పెద్దవాళ్లను, ఇంటి పనిని చూసుకున్నందుకు భార్యకు డబ్బును చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది.

ఇటీవల చైనా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం కింద విడాకుల సమయంలో భార్య భర్త నుంచి పరిహారం కోరేందుకు హక్కు కలిగి ఉంటుంది. ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే కోర్టు ఇటువంటి తీర్పునిచ్చింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య నుంచి విడాకులు కావాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఇదే సమయంలో భార్య కూడా కోర్టుకెక్కి ఐదేళ్ల పాటు తానొక్కదాన్నే ఒకపక్క కొడుకును చూసుకుంటూ మరోపక్క ఇంటి పని మొత్తం చేస్తూ వచ్చానని తెలిపింది. కోర్టు కూడా మహిళ వాదనను సమర్థిస్తూ కొత్త చట్టం కింద పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఇచ్చిన తీర్పును చాలా మంది సమర్థిస్తున్నారు. ఈ తీర్పుతో కోర్టు సరికొత్త మార్గానికి ఒక అడుగు వేసిందని ప్రశంసిస్తున్నారు. కానీ సదరు మహిళ చేసిన పనికి ఈ పరిహారం చాలా తక్కువని చెబుతున్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/