రేపు న‌ర‌సాపురంలో పర్యటించనున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమరావతి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు వెళ్తున్నారు. నరసాపురం రుస్తుం బాద్‌లో రేపు సాయంత్రం ‘మత్స్యకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజ‌రై ప్ర‌సంగించ‌నున్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.

ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టి పెట్టే సమయం, ఆలోచన రెండూ లేవంటూ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మత్స్యకారుల కోసం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే రేపు ఈ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నరసాపురానికి చేరుకుంటారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా పార్టీ తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/