గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్బంగా ఏపీ సర్కార్ కు పవన్ విన్నపం

pawan kalyan support to AP govt

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3,4 తేదీల్లో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సర్కార్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసారు.

‘వైస్సార్సీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం. ఏపీలో ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి’ అని పవన్ కళ్యాణ్ సూచించారు.

‘ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా.. ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి’ అని హితవు పలికారు.

ఇక చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయబోం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.