సీఎం..సీఎం అని పిలవకండి అంటూ కార్యకర్తలను హెచ్చరించిన పవన్

జనసేనాధినేత జోరు వాన ను సైతం లెక్క చేయకుండా తలపెట్టిన శ్రమదానాన్ని పూర్తి చేసారు. రాజమహేంద్రి ఎయిర్‌పోర్టు నుండే అభిమానులు , జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. పవన్ పర్యటన కు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించినప్పటికీ అభిమానులు ఎక్కడ ఆగలేదు.

పవన్‌ కాన్వాయ్‌లోని రెండు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. అయితే పోలీసుల తీరుపై పవన్ కన్నెర్రజేశారు. ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ రాజమండ్రి సెంట్రల్‌లో పోలీసులకు పవన్ సవాల్ విసిరారు. ఆయన సవాల్ చేస్తున్నప్పుడు తీవ్ర ఆగ్రహంతో చేతులు ఊపుతుంటే అభిమానులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

అభిమానులు, నేతలతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పవన్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. ‘సీఎం.. సీఎం.. సీఎం.. ’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపి..‘ ఒక్క నిమిషం ఆగండి.. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవకండి. నేను చాలా అలసిపోయా. ఎందుకు అలసిపోయానో కూడా మీకు వివరంగా చెబుతా. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి.. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవకండి.. మీ నోటి నుంచి ఆ మాటే వినిపించకూడదు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను సీఎం అవ్వాలని మీరు మనసులో దాచుకోండి.. అంతేకానీ ఇలా బయటికి చెప్పకండి..’ అంటూ పవన్ తెలిపారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా పనులు జరగడం లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన హక్కు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. వంగేది లేదు. రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత అని పవన్ అన్నారు.