నాదెండ్ల అరెస్ట్ అప్రజాస్వామికం..విడుదల చేయకపోతే విశాఖకు వచ్చి పోరాడతాః పవన్‌ కల్యాణ్‌

ప్రజల కోసం టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం

pawan-kalyan-respond-on- nadendla-manohar-arrest

అమరావతిః విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే నిరసన తెలిపి ఆ కూడలిని తెరవాలని కోరిన మా నేత నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు.

ప్రజల సమస్యలు తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులు అందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏంటని పవన్ నిలదీశారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తుందని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు.

నాదెండ్ల మనోహర్ ను, ఇతర నేతలను పోలీసులు తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వ్యవహరిస్తే నేను విశాఖపట్నం బయల్దేరి వస్తాను… ప్రజల తరఫున పోరాడతాను అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.