కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైతే పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నుండి నేతలు కాంగ్రెస్ లో చేరారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా అలాగే నేతలు చేరుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి, MLC పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. నిన్న CM రేవంత్ రెడ్డిని కలిసిన వారిద్దరూ వారంలో జాయిన్ అవుతామని తెలిపినట్లు సమాచారం అందుతుంది. ఇక తొలి నుంచి BRS విధేయుడిగా ఉన్న HYD మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ నిన్న హస్తం గూటికి చేరారు. త్వరలోనే మరికొందరు కాంగ్రెస్లో చేరుతారని సమాచారం.

నిన్న పట్నం మహేందర్ ..సీఎం ను కలిసిన సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణలో సీనియర్‌ నాయకుడిగా పట్నం మహేందర్‌ రెడ్డి కి గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ జీవితం టిడిపి పార్టీ నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయిలో మహేందర్‌ రెడ్డి ప్రభావం ఉంది. తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మహేందర్‌ రెడ్డి గెలిచారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి ఇద్దరు కలిసి పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నాటి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి మహేందర్‌ రెడ్డి మంత్రి అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అసంతృప్తితో ఉన్న మహేందర్‌ రెడ్డికి కేసీఆర్‌ ఆగమేఘాల మీద మంత్రి పదవి ఇచ్చారు.

తాండూరు నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించగా.. కేసీఆర్‌ నిరాకరించి సిట్టింగ్‌కే ఇవ్వడంతో మహేందర్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మహేందర్‌ రెడ్డి పక్క దారి చూస్తున్నారని తెలుస్తోంది. తన సొంత వికారాబాద్‌ జిల్లాలో పార్టీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందడంలో మహేందర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని చర్చ జరుగుతోంది. తన సొంత తమ్ముడు పట్నం నరేందర్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిపై పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇతడి సోదరుడి కుమారుడు కూడా వికారాబాద్‌ జిల్లాలో జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం అనుచరులు భారీగా ఉన్నారు.